నేడు విశాఖలో సీఎం పర్యటన.. ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం విశాఖలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున నేతృత్వంలో పలు విభాగాల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం.. ఆంధ్రా క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇప్పటికే విశాఖలో వివిధ క్రీడా ప్రాంగణాల్లో పలు ఆటల పోటీలు గత కొద్ది రోజులుగా హోరాహోరీగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఆయా వేడుకలను విశాఖ మధురవాడ ఏసీఏ-వీడీసీఏ వేధికగా నిర్వహిస్తున్నారు. సాయంత్రం4 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి 5.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఐటి హిల్‌నెంబర్‌ 3కు హెలికాప్టర్‌ ద్వారా చేరుకొని నేరుగా మధురవాడలోని స్టేడియంకు బయలుదేరి వెళ్తారు. 6 నుంచి రాత్రి 8 వరకు ముఖ్యమంత్రి అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత ప్రజలందరికి అభివాదం చేసి ఫైనల్‌ క్రికెట్‌మ్యాచ్‌ను ఆఖరి 5 ఓవర్లు వీక్షిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లైట్స్‌ షో, బాణాసంచా , డ్రోన్‌ షోలుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్యమంత్రి తిలకిస్తారు. అనంతరం క్రీడాకారులు, ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. తదుపరి ఫస్ట్‌ ఫ్రైజ్‌ విన్నింగ్‌ టీమ్‌ల కెప్టెన్‌లకు మెమోంటోలు అందజేస్తారు. అయితే అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చేస్తారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రాత్రి 8.5 గంటలకు మధురవాడ క్రికెట్‌ స్టేడియం నుంచి బయలుదేరి 9.50కు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. మరో వైపు పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు.