అయోధ్య రాముడిని దర్శించుకున్న కేజ్రీ, మాన్‌

లక్నో: అయోధ్యలో కొత్తగా నిర్మించిన భవ్య రామ మందిరానికి వీఐపీల తాకిడి మొదలైంది. ఆదివారం యూపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బృందంగా వెళ్లి బాలరాముడిని దర్శించుకుని, పూజలు చేశారు. కాగా, సోమవారం ఢిల్లిd, పంజాబ్‌ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌ కూడా రాములోరి సేవలో తరించారు. వీరిద్దరూ కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకుని, ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కేజ్రీవాల్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రామ్‌లల్లాను దర్శించుకునే భాగ్యం కలిగింది. మాతోపాటు భగవంత్‌జీ, ఆయన కుటుంబం కూడా అయోధ్యలో పర్యటించారు. దేశ పురోగతి, మానవాళి సంక్షేమం కోసం మేమంతా ప్రార్థించాం. శ్రీరాముడీ ఆశీస్సులు అందరికీ ఉంటాయి. జై శ్రీరామ్‌ అని కామెంట్‌ చేశారు. జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్టకు ఆహ్వాన లేఖ అందినప్పటికీ, ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తర్వాత వీలుచూసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యను సందర్శిస్తానని చెప్పారు. ఈ క్రమంలో పంజాబ్‌ సీఎంతో కలిసి ఆలయానికి వచ్చారు.