24న కుమారధార తీర్ధముక్కోటి

తిరుమలలో కుమారధారతీర్ధ ముక్కోటి ఈనెల 24న వైభవంగా జరగనుంది. ఈ పర్వదినాన భక్తులు తీర్ధమాచరించి ధానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు. వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచలగిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు అడవిలో ఏమి చేస్తున్నావు అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 16 ఏళ్ల నవయువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 24 పౌర్ణమి రోజున గరుడసేవ జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడుని అధిరోహించి తిరు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు.