SBI : ఎస్‌బీఐకి మళ్లి అక్షింతలు

  • ఎన్నికల బాండ్ల వ్యవహారంలో సుప్రీం ఆగ్రహం

SBI: రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికల బాండ్ల వ్యవహారం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు తలనొప్పిగా మారింది. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడిపై గతవారం సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైంది. తాజాగా సోమవారం సర్వోన్నత న్యాయస్థానం చేత చీవాట్లు తినాల్సివచ్చింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై ఎస్‌బీఐని న్యాయస్థానం నిలదీసింది. నంబర్లతో సహా సమగ్ర వివరాలను ఈనెల 21లోగా ఈసీకి ఇవ్వాలని, దానిపై తమకు అఫిడవిట్‌ సమర్పించాలంటూ డెడ్‌లైన్‌ విధించింది.

ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బాండ్ల విషయంలో సెలక్టివ్‌గా ఉండొద్దు. ప్రతి సమాచారం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క విషయాన్నీ దాచడానికి లేదా అణచివేయడానికి వీల్లేదు. ఇదే ఉద్దేశంతో గత తీర్పులో అన్ని వివరాలు ఈసీకి ఇవ్వాలని మేము ఆదేశించాం. ఏ దాత ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారనే విషయం తెలిపే యునిక్‌ నంబర్లతోపాటు అన్ని వివరాలను ఇచ్చి తీరాల్సిందే. ఇందులో ఎలాంటి దాపరికాలు, సందేహాలకు ఆస్కారం లేదు అని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌బీఐకి తేల్చిచెప్పింది.

SBI : ఎస్‌బీఐకి మళ్లి అక్షింతలు
SBI : ఎస్‌బీఐకి మళ్లి అక్షింతలు

మార్చి 21 (గురువారం) సాయంత్రం 5 గంటలలోగా సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ చైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. వివరాలు అందగానే వాటిని ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఈసీఐకి సూచించింది. సుప్రీం ఆదేశాల మేరకు మార్చి 12న గత ఐదేళ్లలో విక్రయించిన ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించిన ఎస్‌బీఐ, బాండ్లకు సంబంధించిన అల్ఫా న్యూమరిక్‌ నంబర్లను మాత్రం వెల్లడించలేదు. దీనిపై సుప్రీంలో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ప్రభుత్వరంగ బ్యాంకు వైఖరిపై అసహనం వ్యక్తంచేసింది. నిర్దిష్ట గడువులోగా సమగ్ర వివరాలు ఇవ్వాలని సూచిస్తూ తాజాగా అల్టిమేటం జారీచేసింది.

  • మా భుజాలు విశాలమైనవి.. : సీజేఐ

విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మె#హతా కోర్టు తీర్పుపై వివరణ కోరారు. ప్రభుత్వ స్థాయిలో కాకుండా మరో స్థాయిలో మంత్రగత్తెల వేట మొదలైంది. కోర్టు ముందు ఉన్నవారు ఉద్దేశపూర్వకంగానే కోర్టును ఇబ్బందికి గురిచేస్తూ పత్రికా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. ఇది స్థాయి వేదిక కాదు. సోషల్‌ మీడియా పోస్ట్‌ల వర్షం కురిపిస్తోంది. గణాంకాలను ప్రజలు కోరుకున్నట్లుగా వక్రీకరించే ప్రమాదముంది.

దీనిపై ధర్మాసనం నిర్దిష్ట ఆదేశాలివ్వాలని మె#హతా కోరారు. ఇందుకు సీజేఐ బదులిస్తూ, న్యాయమూర్తులుగా మేము చట్టబద్ధంగా నడుచుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాము. న్యాయమూర్తులుగా సోషల్‌ మీడియాలో కూడా చర్చిస్తాము. కానీ ఒక సంస్థగా, సోషల్‌ మీడియా వ్యాఖ్యా నాన్ని ఎదుర్కోవడానికి మా భుజాలు తగినంత విశాలంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి అని చెప్పారు.

  • డోంట్‌ షౌట్‌ అట్‌ మి..

ఎలక్టోరల్‌ బాండ్ల కేసు విచారణ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. న్యాయవాది మాథ్యూస్‌ నెడుంపర, సీజేఐ చంద్రచూడ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఎలక్టోరల్‌ బాండ్ల కేసు అస్సలు న్యాయబద్ధమైన సమస్య కాదు. విధానపరమైన అంశం. కోర్టుల జోక్యం తగదు అని నెడుంపర అన్నారు. దీనిపై సీజేఐ స్పందించారు. మీరు ఆగండి..నాపై అరవడం ఒక్క సెకను ఆపండి. నేను చెప్పేది వినండి. ఈ అంశాన్ని మీరు పౌరుల కోణంలో చూస్తున్నట్లయితే, నేను ఈ దేశ పౌరుడినే అంటూ ఘాటుగా బదులిచ్చారు. లేదు, లేదు.. నేను అరవడం లేదు..

సావధానంగానే ఉన్నాను అంటూ నెడుంపర మాట్లాడుతూ ఉండగా, జస్టిస్‌ బిఆర్‌ గవాయి జోక్యం చేసుకుని, మీరు న్యాయ నిర్వ#హణ ప్రక్రియలో అడ్డుకుంటున్నారు అని అసంతృప్తి వ్యక్తంచేశారు. దాంతో మా పట్ల దయచూపండి అని నెడుంపర అభ్యర్థించారు. అయినా బెంచ్‌ చలించలేదు. విచారణ సందర్భంగా జోక్యం చేసుకోవాలనుకున్న సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రో#హత్గిd, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆదిష్‌ అగర్వాలా వాదనలు వినడానికి కూడా కోర్టు నిరాకరించింది. న్యాయవాది గతంలో ఎదుర్కొన్న కోర్టు ధిక్కార చర్యను కూడా ధర్మాసనం గుర్తు చేసింది.

  • బార్‌ అసోసియేషన్‌ చీఫ్‌పై సీజేఐ ఆగ్రహం

ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సూమోటోగా సమీక్షించాలని కోరుతూ సీనియర్‌ అడ్వొకేట్‌, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆదిష్‌ అగర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ ఒకింత అసహనానికి గురి అయ్యారు. మీరు సీనియర్‌ న్యాయవాది. పైగా, న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కూడాను.ఇది కేవలం పబ్లిసిటీ కోసం వేసిన పిటిషన్‌.దీనిపై నా స్పందన కోరడం సబబుగా లేదు. పైగా సూమోటో అధికారాలతోసమీక్ష చేపట్టాలంటున్నారు.

ఎలాంటి సందర్భాల్లో సూమోటో అధికారాలతో విచారణ చేపడతారో మీకు తెలియదా? అని అగర్వాల్‌ని ప్రశ్నించారు. ఆయన సమాధానాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమర్ధించారు.ఇంతకుముందు ఎన్నికల బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్రపతి రిఫరెన్స్‌ కోరుతూ రాష్ట్రపతిద్రౌపది ముర్ముకు అగర్వాల్‌ ఒక లేఖ రాశారు.అయితే, అగర్వాల్‌ ఈ లేఖను రాష్ట్రపతికి రాయడంతో న్యాయవాదుల సంఘానికిఎటువంటి సంబంధం లేదని ఆ సంఘం కార్యవర్గం స్పష్టంచేసింది. ఈ లేఖ అగర్వాల్‌ వ్యక్తిగత హోదాతో రాసినట్టు కనిపిస్తోందని ఆలిండియా బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ పాండే ఒక ప్రకటనలోపేర్కొన్నారు.