Amit Shah : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందే తీసుకువచ్చింది. అయితే కొన్ని ప్రాంతాలు, వర్గా నుంచి వచ్చిన ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో సీఏఏ అమలును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అయితే 2024 ఎన్నికలకు ముందు దేశంలో ఈ సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్-సీఏఏను అమలు చేయాలని బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు దీనికి సంబంధించి.. కొంత సమాచారాన్ని కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన సంఘటనలు.. దేశంలో త్వరలోనే సీఏఏ అమలు కావచ్చనే సూచనలకు బలం చేకూరుస్తున్నాయి.
బీజేపీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు అయిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కార్లకు సంబంధించిన నంబర్ ప్లేట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ కార్ల నంబర్ ప్లేట్లు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఎందుకంటే వాటి మీద CAA అని రాసి ఉండటమే కారణం. దేశంలో మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. వాటి కంటే ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని.. అందుకే దానికి సూచనగానే కేంద్ర మంత్రులు CAA ఉన్న కారు నంబర్ ప్లేట్లను వాడుతున్నారని కాషాయ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోంది.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బీజేపీ ఎన్నికల సంఘం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో వారు ప్రయాణించిన కారు నంబరు ప్లేట్లపై ఉన్న సంఖ్యల మధ్యలో CAA అని రాసి ఉంది. ఇప్పుడు ఇదే రకరకాల ఊహాగానాలకు దారి తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ సీఏఏ చట్టాన్ని అమలు చేయబోతున్నట్లు సంకేతాలు ఇస్తోందా అనే ప్రశ్నలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 29 వ తేదీన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో అమిత్ షా కారు నంబరు డీఎల్ 1 సీఏఏ 4421 అని ఉంది.