- రష్యా అధ్యక్షుడుగా రికార్డు ఎన్నిక
- 87 శాతం ఓట్లతో ఏకపక్ష విజయం
Putin : వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యర్థులను భారీ మెజారిటీతో ఓడించి ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోమవారం వెల్లడైన ఫలితాలలో పుతిన్ గెలుపొందినట్లు రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. మొత్తం ఓట్లలో అతనికి 87 శాతం పోలయ్యాయి. ఈ గెలుపుతో మరో ఆరేళ్లు అధ్యక్ష పదవిలో పుతిన్ కొనసాగనున్నారు. తద్వారా దాదాపు 24 ఏళ్లు రష్యాను పాలించిన రికార్డును సొంతం చేసుకున్నారు. 200 ఏళ్ల రష్యా చరిత్రలో సుదీర్ఘకాలం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్ రికార్డును పుతిన్ బ్రేక్ చేశాడు.
ఎన్నికల ఫలితాల అనంతరం జాతినుద్దేశించి మాస్కోలో పుతిన్ విజయోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావించారు. కీవ్‌లో ప్రత్యేక సైనిక చర్య పనులను పరిష్కరించడానికి, రష్యన్ మిలిటరీని బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తానని నొక్కిచెప్పారు. ”మన ముందు చాలా పనులు ఉన్నాయి. కానీ మనం ఏకీకృతం అయినప్పుడు, మనల్ని భయపెట్టాలని, అణచివేయాలని చూసినవాళ్లెవరూ చరిత్రలో విజయం సాధించలేదు. వారు ఇప్పుడు విజయం సాధించలేరు. భవిష్యత్తులో సాధించలేరు అని చెప్పారు.
రాయిటర్స్ ప్రకారం, రష్యా ఎన్నికలు శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగాయి. 89కి పైగా ప్రాంతాలలో పోలింగ్ జరిగింది. ఏదేమైనప్పటికీ, సంవత్సరాలుగా, రష్యా ఎన్నికలు రిగ్గింగ్ పేరిట అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా కేవలం ఒక అభ్యర్థి మాత్రమే విజయం సాధించే లాంఛన ప్రక్రియగా మారాయన్న విమర్శలున్నాయి. ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై పుతిన్ స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలని అనుకున్నట్లు తెలిపారు.
అయితే, అంతలోనే ఆయన మరణించారని అన్నారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను స#హచరులు తన ముందు ఉంచారని, ఇందుకు తాను అంగీకారం కూడా తెలిపానని అన్నారు. ఈ ప్రక్రియలో చర్చలు తుదిదశలో ఉండగా, అంతలోనే ఇలా జరిగిపోయింది అని విచారం వ్యక్తంచేశారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఇది జీవితం అని పుతిన్ వ్యాఖ్యానించారు.
అమెరికాపై పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది ప్రజాస్వామ్య దేశం కాదన్నారు. అమెరికా పరిణామాలను చూసి ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయని అన్నారు. మేము చాలా సంయమనంతో ఉన్నాం. కానీ అమెరికాలో విపత్తు ఉంది. అమెరికా తన వద్ద ఉన్న అన్ని అధికారాలను వాడుకుని, దేశాధ్యక్ష అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యక్తిపై దాడిచేస్తోంది. డోనాల్డ్ ట్రంప్‌ను బైడెన్ ప్రభుత్వం వేధిస్తోందని పరోక్షంగా చెప్పారు. అభ్యర్థి రేసులో ట్రంప్ ముందు వరుసలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం కేసులతో అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు. విదేశీ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోదన్న పుతిన్, అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా వారితో కలిసి పనిచేస్తామని పునరుద్ఘాటించారు.
రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్‌తోపాటు మరో ముగ్గురు పోటీపడ్డారు. నికోలాయ్ ఖరిటోనోవ్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక అభ్యర్థి. 2000 నుండి జరిగిన ప్రతి ఎన్నికలలో పుతిన్‌పై పోటీచేసి రెండవ స్థానంలో నిలిచింది. 75 ఏళ్ల నికోలాయ్ ఖరిటోనోవ్ దిగువ సభలో సభ్యుడు. కేవలం 4 శాతం కంటే తక్కువ ఓట్లు పొందారు. పుతిన్‌ను సవాలు చేసిన మరో అభ్యర్థి వ్లాడిస్లావ్ దావన్‌కోవ్ మూడో స్థానంలో నిలిచారు. దావన్‌కోవ్ స్టేట్ డూమా డిప్యూటీ ఛైర్మన్. మరొక అభ్యర్థి అల్ట్రా-నేషనలిస్ట్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా నాయకుడు లియోనిడ్ స్లట్స్కీ.
ఇతను నాలుగో స్థానంలో నిలిచారు. ప్రధాన ప్రత్యర్థి నావల్నీ ఎన్నికలకు ముందే చనిపోవడంతో ఆయనకు అసలు పోటీయే లేకుండా పోయింది. రష్యా ఎన్నికలు శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు కొనసాగాయి. 89కి పైగా ప్రాంతాలలో పోలింగ్ జరిగింది. ఏదేమైనప్పటికీ, సంవత్సరాలుగా, రష్యా ఎన్నికలు రిగ్గింగ్ పేరిట అపఖ్యాతిని మూటగట్టుకున్నాయి. గత రెండు దశాబ్దాలుగా కేవలం ఒక అభ్యర్థి మాత్రమే విజయం సాధించే లాంఛన ప్రక్రియగా మారాయన్న విమర్శలున్నాయి.
రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు. భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు రాబోయే రోజుల్లో మీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాను అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్టు చేశారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా పుతిన్‌ను అభినందించారు. రష్యా మరిన్ని విజయాలు సాధిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. రెండు దేశాల బంధానికి అ్యంత ప్రాముఖ్యత ఇస్తామని పేర్కొన్నారు.
కాగా, ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని యురోపియన్ యూనియన్ ఫారిన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోర్నెల్ ఆరోపించారు. ఆ ఎన్నికల్లో అణిచివేత, బెదిరింపులకు పాల్పడినట్లు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలపై త్వరలోనే 27 ఈయూ సభ్యదేశాలు సంయుక్త ప్రకటన చేయనున్నాయని చెప్పారు. పుతిన్ నెగ్గింది సూడో ఎలక్షన్ అని జర్మనీ ఆరోపించింది. ఓటింగ్ స్వేచ్ఛగా, న్యాయబద్దంగా జరగలేదని అమెరికా తెలిపింది. అధికార దా#హంతో పుతిన్ ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఎన్నటికీ పరిపాలనను తన చేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
24 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం..
- న్యాయవిద్యను అభ్యసించిన పుతిన్ 1975లో రష్యా గూఢచార సంస్థలో చేరారు.
- 1991లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
- 1998లో రష్యా సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్‌గా నియమితులయ్యారు.
- 1999లో నాటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ పుతిన్‌ను ప్రధానిగా నియమించారు.
- కొద్ది నెలలకే ఎల్సిన్ రాజీనామా చేయడంతో అధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చారు.
- 2000, 2004లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు.
- మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు నిబంధనలు అడ్డురావడంతో 2008లో మళ్లిd ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచుతూ ఈ సమయంలోనే రాజ్యాంగ సవరణ చేశారు.
- 2012లో మూడోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన పుతిన్, 2018లో నాలుగోసారి అత్యున్నత పీఠాన్ని అధిష్టించారు. తాజా గెలుపుతో ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా అరుదైన ఘనత సాధించారు.
- ఈ ఆరేళ్లు అధికారంలో ఉండగలిగితే, 29 ఏళ్లు సోవియట్‌ను పాలించిన జోసెఫ్ స్టాలిన్ రికార్డును పుతిన్ బ్రేక్ చేసినట్లు అవుతారు. తద్వారా 200 సంవత్సరాల రష్యా చరిత్రలో సుదీర్ఘ పాలకుడిగా నిలుస్తారు.