Tata Motors: భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వా#హనాల విభాగాలపై దృష్టి సారించేందుకు రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడదీయాలని యోచిస్తోంది. ఈ మేరకు సోమవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. వాణిజ్య వాహనాల వ్యాపారం, దాని సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థలో, ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), జాగ్వార్ ల్యాండ్ రోవర్,సంబంధిత పెట్టుబడులతో సహా ప్రయాణీకుల వాహనాల వ్యాపారాలు మరొక సంస్థలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నది. టాటా మోటార్స్ వాటాదారులు రెండు సంస్థలలో ఒకే విధమైన వాటాను కలిగి ఉంటారని కంపెనీ తెలిపింది.
ఉద్యోగులకు మెరుగైన వృద్ధి అవకాశాలు, షేర్ హోల్డర్ల విలువను పెంపొందించడానికి ఈ విభజన దోహదపడుతుందని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. విభజన (డీమెర్జర్) కోసం ఏర్పాటు చేసిన పథకం రాబోయే నెలల్లో బోర్డు ముందు ఉంచబడుతుంది. అవసరమైన అన్ని వాటాదారులు, రుణదాత, నియంత్రణ ఆమోదాలకు లోబడి ఉంటుంది, ఇది పూర్తి కావడానికి మరో 12-15 నెలలు పట్టవచ్చని కంపెనీ తెలిపింది. విభజన వల్ల ఉద్యోగులు, కస్టమర్‌లు, వ్యాపార భాగస్వాములపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది.